వరంగల్:
ఖానాపూర్ మండల సర్వసభ్య సమావేశంలో 24 శాఖల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి 13 గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులందరూ రైతు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, వాటి ప్రయోజనాలను వివరించారు. అర్హులైన ప్రతి గిరిజన లబ్ధిదారుడికి ప్రభుత్వ ఫలాలు అందేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సూచించారు.
జడ్పీ సీఈవో వసంత మాట్లాడుతూ.. గ్రామాల్లో జలసిరి పనుల ప్రాధాన్యత, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు, మెటీరియల్ కాంపోనెంట్ పనుల పురోగతిపై సమీక్షించారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచాలని, కూలీల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని సర్పంచులకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. జలసిరి పనులను సమర్థవంతంగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఉపాధి హామీ పథకంలో కూలీల సమీకరణలో విశేష ప్రతిభ కనబరిచిన నాజీతండా గ్రామ సర్పంచ్ బదావత్ జ్యోతిని అధికారులు అభినందించారు. అలాగే, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన తొమ్మిది మంది సర్పంచులలో ఒకరిగా నిలిచి, ఢిల్లీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రతినిధిగా 'ఎల్-నినో' కార్యాచరణ ప్రణాళికను వివరించనున్న అశోక్‌నగర్ గ్రామ సర్పంచ్ జాడి అచ్యుతంను ప్రత్యేకంగా సత్కరించారు. వీరిద్దరినీ జడ్పీ సీఈవో వసంత, మండల ప్రత్యేక అధికారి నారాయణరెడ్డి, ఎంపీడీఓ డాక్టర్ వి. అద్వైత, ఎంపీఓ ఏ. సునీల్ కుమార్ శాలువాలతో ఘనంగా సన్మానించారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!