బ్లాక్ ఫ్రైడే సేల్స్ సందర్భంగా పెరుగుతున్న ఆన్‌లైన్ షాపింగ్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో శుక్రవారం (నవంబర్ 27) ఒక సైబర్ భద్రతా హెచ్చరికను జారీ చేసింది. నకిలీ ఆఫర్లు, మోసపూరిత వెబ్‌సైట్లు, అనుమానాస్పద పేమెంట్ లింక్‌లు మరియు క్యూఆర్ కోడ్‌ల బారిన పడవద్దని వినియోగదారులను కోరింది. పండుగలు, ప్రత్యేక సేల్స్ సమయంలో వినియోగదారుల ఆసక్తిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మరియు ప్రముఖ బ్రాండ్ వస్తువులపై నమ్మశక్యం కాని రీతిలో భారీ డిస్కౌంట్లు, ఉచిత డెలివరీ, గ్యారెంటీ ఒరిజినల్ ఉత్పత్తులు, సులభమైన రిటర్న్ పాలసీలు అంటూ సోషల్ మీడియాలో స్పాన్సర్డ్ ప్రకటనలు ఇస్తూ నకిలీ ప్లాట్‌ఫారమ్‌లలో డబ్బులు చెల్లించేలా మోసగిస్తున్నారని హెచ్చరించారు.
టీజీసీఎస్‌బీ జారీ చేసిన ముఖ్య సూచనలు:
నమ్మకమైన సైట్లలోనే కొనుగోలు చేయండి. కేవలం అధికారిక యాప్‌లు లేదా విశ్వసనీయమైన వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే షాపింగ్ చేయాలి. చెల్లింపులు చేసే ముందు వెబ్‌సైట్ URL లింక్‌లను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.
ఆశపెట్టే ఆఫర్లకు దూరంగా ఉండండి. వాస్తవానికి దూరంగా, నమ్మశక్యం కాని రీతిలో తక్కువ ధరలకు వస్తువులు ఇస్తామనే వాట్సాప్, ఎస్ఎంఎస్ మరియు సోషల్ మీడియా లింక్‌లను క్లిక్ చేయవద్దు.
బ్యాంకింగ్ వివరాలు పంచుకోవద్దు. ఓటీపీ, యూపీఐ పిన్, సీవీవీ లేదా ఇతర బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయవద్దని స్పష్టం చేసింది.
సైబర్ మోసం జరిగితే 1930కి కాల్ చేయండి:
"క్లిక్ చేసే ముందు ఆలోచించండి.. చెల్లించే ముందు సరిచూసుకోండి" అని బ్యూరో పిలుపునిచ్చింది. ఒకవేళ ఎవరైనా సైబర్ ఆర్థిక మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయాలని లేదా అధికారిక పోర్టల్ cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!