ముందడుగు/ఆదిలాబాద్ జిల్లా : పూజలు, మంత్రతంత్రాలతో డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లను అసలైన కరెన్సీగా నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో నలుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.40 లక్షలకు పైగా విలువైన 99 కట్టల నకిలీ నోట్లు, 100 నకిలీ బంగారు నాణేలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు ఇప్పటికే వేరే కేసులో అరెస్టయ్యారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు.

 

రూ.8 లక్షలు వసూలు చేసి మోసం

 

మంచిర్యాల జిల్లాకు చెందిన పత్తి రాములుకు 2023 నవంబరులో ఇంద్రవెల్లి మండలానికి చెందిన అత్రం పరశురామ్ పరిచయమయ్యాడు. పూజలు, మంత్రతంత్రాలతో డబ్బులు రెట్టింపు చేస్తానని నమ్మించి రూ.6.50 లక్షలు తీసుకున్నాడు. అనంతరం ఓ పొలం వద్ద పూజలు చేసి, డబ్బులు రెట్టింపు అయ్యాయని చెబుతూ ఓ బ్యాగును అందజేసి పది రోజుల తర్వాత తెరవాలని సూచించాడు. బాధితుడు బ్యాగు తెరిచి చూడగా అందులో అసలైన కరెన్సీకి బదులుగా చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లు, తెల్ల కాగితాలు కనిపించాయి. తిరిగి బాధితుడిని నమ్మించి ఇంటి శుద్ధి పూజల పేరుతో మరో రూ.1.50 లక్షలు వసూలు చేశాడు. ఇలా మొత్తం రూ.8 లక్షలు తీసుకుని మోసగించాడు. బాధితుడి ఫిర్యాదుతో ఈ నెల 22న ఉట్నూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

నలుగురు అరెస్టు.. ఇద్దరు ఇప్పటికే కస్టడీలో

 

తాజాగా అరెస్టయిన వారిలో నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం చెన్నూరుకు చెందిన ఎంబడి మల్లేష్, మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి చెందిన చీటి తరుణ్ , జమల్‌పూర్ సాయి కృష్ణ, పేంద్రం సురేష్ ఉన్నారు. ప్రధాన నిందితులైన ఇంద్రవెల్లి మండలం గిన్నెరకు చెందిన అత్రం పరశురామ్, ఇంద్రవెల్లి శాంతినగర్‌కు చెందిన మండలి బక్కన్న లు ఇప్పటికే ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరో కేసులో అరెస్టయ్యారు.

 

రూ.40 లక్షలకు పైగా విలువైన నోట్లు స్వాధీనం

 

నిందితుల నుంచి రూ.500 ముఖ విలువతో ముద్రించిన నోట్ల 34 కట్టలు, రూ.100 ముఖ విలువతో 55 కట్టలు, రూ.2 వేల ముఖ విలువతో 10 కట్టలు.. మొత్తం 99 కట్టలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.40 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. వీటితోపాటు 100 నకిలీ బంగారు నాణేలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

 

బాధితులు ముందుకు రావాలి

 

నిందితులపై ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో పలు కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. ఒక్కొక్కరిపై మూడు కేసుల వరకు ఉన్నాయని, ఈ ముఠా చేతిలో సుమారు 40 మంది బాధితులు మోసపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులు ఎవరైనా ఉంటే భయపడకుండా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు. మంత్రతంత్రాలతో డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని, తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయనే ఆశతో డబ్బులు ఇచ్చి మోసపోవద్దని హెచ్చరించారు. కరెన్సీ కట్టలను స్వీకరించే సమయంలో ప్రతి నోటును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.