ముందడుగు/ఆదిలాబాద్ జిల్లా : వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి అవసరమైన నిధులు కేటాయించాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ కోరారు. ఆయన నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ పీఏసీ సభ్యులు మంగళవారం హైదరాబాద్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిసి జిల్లాలోని అభివృద్ధి అవసరాలు, ప్రజా సమస్యలను వివరించారు. జిల్లాలో పెండింగ్ పనుల పూర్తికి, కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలని కోరారు. ఇళ్లులేని పేద కుటుంబాలకు అదనంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అభివృద్ధితో పాటు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నరేష్ జాదవ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పీఏసీ సభ్యులు పాల్గొన్నారు.