ముందడుగు/ఆదిలాబాద్ జిల్లా : రిమ్స్ ఆసుపత్రిలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ నాయకులు కోరారు. నూతన డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బలరాం చిక్టే, సూపరింటెండెంట్ సత్యనారాయణను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం, అత్యవసర సేవలు నిరంతరాయంగా అందించడం, రోగులకు మందులు, వైద్య పరీక్షలు అందుబాటులో ఉంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు మళ్లిస్తున్నారనే ఫిర్యాదులు, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల పనితీరు, ఆర్థిక అవకతవకల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని మూడు వినతిపత్రాలు అందజేశారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడాల స్వామి మాదిగ మాట్లాడుతూ.. రిమ్స్ వేలాది పేద కుటుంబాలకు వైద్య భరోసా కల్పించే ప్రభుత్వ ఆసుపత్రి అని, కులమతాలకు, ఆర్థిక స్థితికి అతీతంగా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందాలని అన్నారు. నూతన యాజమాన్యానికి నిర్మాణాత్మక సహకారం అందిస్తూనే పేదల వైద్య హక్కుల పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ, అన్నెపాగ అశోక్ మాదిగ, కారెం రవి మాదిగ, సిరిసిల్ల భూమయ్య మాదిగ, గుర్రాల ఆశన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు.