హైదరాబాద్: పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ) విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమోల్లో పేరు, పుట్టిన తేదీ తదితర వివరాల్లో తప్పులు ఉన్నవారు వాటిని సరిచేసుకునేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా మీ సేవ కేంద్రాల ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈ. నవీన్ నికోలస్ వెల్లడించారు.

ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి ఈ సేవలు ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఎస్‌ఎస్‌సీ మెమోల్లో నమోదైన వివరాల్లో పొరపాట్లు ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, సంబంధిత వ్యక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

దరఖాస్తు విధానం ఇలా..

ఎస్‌ఎస్‌సీ మెమోలో పేరు లేదా పుట్టిన తేదీలో సవరణ అవసరమైన వారు సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సంప్రదించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో సరిచేయాల్సిన వివరాలను స్పష్టంగా, కచ్చితంగా నమోదు చేయడంతో పాటు వాటికి సంబంధించిన సరైన ఆధార పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తుదారులు సమర్పించిన వివరాలు, ఆధార పత్రాలను పాఠశాల విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తారు. విద్యాశాఖ నిబంధనలు, నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం అర్హతను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటారు.