ముందడుగు/ఆదిలాబాద్ జిల్లా : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని క్లారిటీ భవన్ ఎదుట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి ఆర్. లక్ష్మి పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్. లక్ష్మి మాట్లాడుతూ.. 2012 నవంబర్ 26న అరవింద్ కేజ్రీవాల్ కొంతమంది సభ్యులతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారని తెలిపారు. దేశంలో అవినీతిని అంతం చేయడం, ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్య సేవలు అందించడమే పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. పార్టీ స్థాపించిన కొద్ది సంవత్సరాల్లోనే జాతీయ పార్టీగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యం
తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం అందిస్తామని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి ఆదరణ కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన పలువురికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆప్ నాయకులు సుభాష్, రాథ, బేంపూర్ మండల అధ్యక్షుడు రాహుల్, తలమడుగు మండలానికి చెందిన ఆశన్న, ఆర్. అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!