మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూర్ గ్రామంలో గోదావరి నది లోగల సుందిళ్ల ప్రాజెక్టు వరద ముప్పు ఉన్న ప్రాంతంలో మహిళా భవన్ భవనాన్ని నిర్మించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 గోదావరి నదికి వరదలు వచ్చిన సమయంలో గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు, ఇళ్లు నీట మునిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మహిళా భవన్ నిర్మాణానికి ముంపు ప్రాంతాన్ని ఎలా ఎంపిక చేశారనే ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ నిధులతో నిర్మించే భవనాలు ప్రజలకు ఉపయోగపడేలా, భవిష్యత్తులో ఎదురయ్యే ప్రకృతి విపత్తులను దృష్టిలో పెట్టుకొని నిర్మించాల్సిన అవసరం ఉంది. 


ముఖ్యంగా గోదావరి వరదల సమయంలో ఇళ్లు నీట మునిగి ప్రజలు నిరాశ్రయులైతే వారికి తాత్కాలిక ఆశ్రయం కల్పించేందుకు గ్రామంలో సురక్షితమైన భవనం ఎంతో అవసరం.

ఈ నేపథ్యంలో మహిళా భవన్‌ను గోదావరి ముంపు ముప్పు ఉన్న ప్రాంతంలో కాకుండా, గ్రామంలోని ఎత్తైన, సురక్షితమైన ప్రదేశంలో నిర్మిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. వరదల సమయంలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఈ భవనంలో తలదాచుకునే అవకాశం ఉంటుంది. అదే ముంపు ప్రాంతంలో భవనం నిర్మిస్తే వరదలు వచ్చినప్పుడు ఆ భవనం కూడా నీట మునిగే ప్రమాదం ఉండటంతో ప్రజలకు ఆశ్రయం కల్పించే లక్ష్యం నెరవేరకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.