గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గురువారం రాత్రి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. యూనివర్సిటీలోని మెన్స్ హాస్టల్ ఎం, అనెక్స్ మరియు ఎన్‌ఆర్‌ఎస్ హాస్టళ్లలో ఆహారం తిన్న తర్వాత కనీసం 40 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అత్యవసర సమయంలో డ్రైవర్ల కొరత ఏర్పడటంతో, ఒక విద్యార్థే స్వయంగా ఆంబులెన్స్ నడిపి తన తోటి విద్యార్థులను యూనివర్సిటీ హెల్త్ సెంటర్‌కు తరలించాల్సి వచ్చింది. 

అస్వస్థతకు గురైన వారిలో సార్థక్ రాజ్, సందీప్, సుదర్శన్ రెడ్డి, మహ్మద్ సమద్, సాయినాథ్, కార్తికేయ తదితర విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా యూనివర్సిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు. ఉదయం అల్పాహారంలో పోహా తిన్న తర్వాత కొందరికి నలతగా అనిపించగా, మధ్యాహ్న భోజనంలో వేయించిన కూరగాయలు తిన్న మరికొందరు పలుమార్లు వాంతులు చేసుకున్నారని తెలిపారు. రాత్రి భోజనంలో రాజ్మా రైస్ తిన్న తర్వాత మిగిలిన విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారని, హెల్త్ సెంటర్‌లో మందులు ఇచ్చిన తర్వాత కొందరిని డిశ్చార్జ్ చేశారని ఆయన పేర్కొన్నారు.