ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ అనంతరం బస్సు కోసం వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురై మృతి చెందిన హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన కొమ్ము సారవ్వ (55) కుటుంబాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో సారవ్వ పార్థివ దేహానికి నివాళులర్పించి, జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ.5 లక్షల చెక్కును అందజేశారు. మహిళా సంఘం సభ్యురాలైన సారవ్వకు వర్తించే రూ.10 లక్షల ప్రమాద బీమా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.