హైదరాబాద్: మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సైదాబాద్ పరిధిలో గల సాయినగర్, శంకేశ్వర్ బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈగల్ ఫోర్స్ అవగాహన బృందం ఎల్‌ఈడీ వాహనంతో పాఠశాలలకు చేరుకుని విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరించింది.

ఈ సందర్భంగా ఎల్‌ఈడీ తెరపై మాదకద్రవ్యాల దుష్ప్రభావాలకు సంబంధించిన అవగాహన వీడియోలను ప్రదర్శించారు. విద్యార్థులకు అవగాహన పుస్తకాలను పంపిణీ చేశారు. చెడు స్నేహాలు, తోటి విద్యార్థుల ఒత్తిడికి (పీర్ ప్రెజర్) లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

మాదకద్రవ్యాల సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1908కు కాల్ చేయవచ్చని, ఈగల్ తెలంగాణ కంట్రోల్ రూమ్ నంబర్ 8712671111కు ఫోన్ లేదా సందేశం ద్వారా సమాచారం అందించవచ్చని ప్రచారం చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈగల్ ఫోర్స్ కోరింది.