ఆదిలాబాద్: క్షుద్రపూజలు, మంత్రతంత్రాల ద్వారా డబ్బులు రెట్టింపు, నాలుగింతలు చేస్తామని ఆశచూపి అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఇచ్చోడ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.3 లక్షల 74 వేల నగదు, మూడు కార్లు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ (ఐపీఎస్) ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
అసలు ఏం జరిగిందంటే..
నిందితులు రహస్య పూజలు, క్షుద్రవిద్యల శక్తితో కొద్ది రోజుల్లోనే డబ్బును రెట్టింపు చేస్తామని అమాయక ప్రజలను నమ్మించేవారు. ఈ క్రమంలో నవంబర్ 19న ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-44పై టీజీడబ్ల్యూఆర్‌జేసీ (TGWRJC) పాఠశాల అండర్ బ్రిడ్జి సమీపంలో తుకాలా రాజు అనే వ్యక్తి వద్ద నుంచి నిందితులు రూ.3 లక్షలు దోచుకున్నారు. డబ్బులు రెట్టింపు అవుతాయనే ఆశతో బాధితుడు తన స్నేహితుడు శ్రీపతి శంకర్‌తో కలిసి అక్కడికి వెళ్లాడు. నోట్లు తనిఖీ చేస్తామనే నెపంతో నిందితులు డబ్బులు లాక్కొని, ఇద్దరిపై దాడి చేసి కారులో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇచ్చోడ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నారు.
పలు జిల్లాల్లో కేసులు.. బాధితులు:
పట్టుబడిన నిందితులను ఆత్రం పరశురాం (40), మండలి బక్కన్న (47), నౌగాడే శేఖర్ (39), మండలి శైలేష్ (27), షేక్ అలీమ్ (36)గా గుర్తించారు. ఈ ముఠా మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి తదితర జిల్లాల్లోనూ నేరాలకు పాల్పడింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ ముఠాపై మొత్తం 8 కేసులు (ఇంద్రవెల్లిలో 5, ఉట్నూర్‌లో 2, ఇచ్చోడలో 1) నమోదయ్యాయి. జిల్లాలో 10 మంది, రాష్ట్రవ్యాప్తంగా 24 మంది బాధితులను ఇప్పటివరకు గుర్తించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్ రమేష్, గుడిహత్నూర్ ఎస్ఐ ఎల్. శ్రీకాంత్, ఇచ్చోడ ఎస్ఐ కె. విష్ణుప్రకాష్లను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్ సాయి కోటె (ఐపీఎస్), సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!