హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ బీఎం సందీప్‌తో రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వ పనితీరుపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి, ఎమ్మెల్యేల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని సందీప్‌కు వివరించినట్లు సమాచారం.
నిధుల కేటాయింపులో వివక్షపై ఆవేదన
నియోజకవర్గాల అభివృద్ధికి నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని, ముఖ్యమంత్రి, మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు నిధులు విడుదలవుతున్నప్పటికీ ఇతర ఎమ్మెల్యేల నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదని రాజగోపాల్ రెడ్డి వివరించినట్లు సమాచారం. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం, రోడ్ల అభివృద్ధి పనులకు నిధులు అందకపోవడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
అధిష్ఠానం జోక్యంతో రాజకీయ చర్చలు
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నవారు అహంకార ధోరణి వీడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆయనను సంప్రదించి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ బీఎం సందీప్‌తో సమావేశం కావాలని సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, తాను కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచనలో లేనని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నదే తన లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి గతంలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సందీప్‌తో జరిగిన భేటీ తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చుతుందా? లేక అంతర్గత విభేదాలు మరింత ముదురుతాయా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!