ఆదిలాబాద్: తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, రైతులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మండల కమిటీ, మండల రైతు జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం సుంకిడీ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై భారీ నిరసన చేపట్టారు. సుమారు నాలుగు గంటల పాటు రహదారిని దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ ఆగ్రహం:
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్ మాట్లాడుతూ.. జిల్లాలోని పలు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం తలమడుగును విస్మరించడంపై మండిపడ్డారు. వారం రోజుల్లోనే మండలంలో ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం వ్యవసాయ సంక్షోభానికి అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి సాగు విస్తీర్ణం, వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాలను సమగ్రంగా పరిశీలించి తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఆర్డీవో హామీతో ఆందోళన విరమణ:
అనంతరం ఆర్డీవో రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో వేట్టి మనోజ్, పద్మాకర్ రెడ్డి, ముడుపు మౌనీష్ రెడ్డి, కుమ్ర జ్ఞానేశ్వర్, జంగాల పోచన్న, గోడం భుజంగరావు, మేడి సిడం మాధవ్, సర్పంచ్లు, రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!