ప్రముఖ ఇన్వెస్టర్, ప్రపంచ ప్రఖ్యాత ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన హెచ్చరికలు చేశారు. 2008 నాటి ఆర్థిక మాంద్యం కంటే ఎంతో పెద్దదైన ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందని ఆయన సోమవారం (నవంబర్ 23) ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వ అప్పులు ఇప్పటికే 49 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని మరింత పెరుగుతున్నాయని, ఫెడరల్ రిజర్వ్ మరియు ట్రెజరీ విచ్చలవిడిగా నోట్లు ముద్రించడం వల్ల కరెన్సీ విలువ పడిపోయి ద్రవ్యోల్బణం తీవ్రమవుతుందని కియోసాకి విశ్లేషించారు. దీనికి తోడు కృత్రిమ మేధస్సు ఉద్యోగ భద్రతను మింగేస్తుందని, ఇప్పటికే వోక్స్‌వ్యాగన్ వంటి దిగ్గజ సంస్థలు లక్ష మంది ఉద్యోగులను తొలగించాయని, ఐరోపాలో అల్లర్లు జరుగుతున్నాయని ఆయన ఉదహరించారు.


2002లో తాను రాసిన ‘రిచ్ డాడ్స్ ప్రాఫెసీ’ పుస్తకంలోనే ఈ పరిణామాలను ముందే ఊహించి హెచ్చరించానని కియోసాకి గుర్తు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరలు తగ్గుముఖం పట్టడం సామాన్య ఇన్వెస్టర్లకు భయంగా అనిపించినా, తెలివైన ఇన్వెస్టర్లకు ఇదొక గొప్ప కొనుగోలు అవకాశమని ఆయన అభిప్రాయపడ్డారు. తాను స్వయంగా భౌతిక బంగారం, వెండి, బిట్‌కాయిన్ మరియు ఎథేరియం కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. కేవలం డిగ్రీల మీద ఆధారపడకుండా ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారానే ప్రజలు రాబోయే ఆర్థిక తుఫాను నుండి తమను తాము రక్షించుకోగలరని కియోసాకి స్పష్టం చేశారు.