తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో దేశ ప్రగతికి తెలంగాణ తనవంతు కృషి చేస్తుందని స్పష్టం చేశారు. దేశ భద్రత, జాతీయ ప్రాధాన్యతలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమం వంటి అంశాల్లో రాజకీయాలకు అతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో గురువారం నిర్వహించిన 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (IRC) వార్షిక సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేసి, మిగిలిన సమయంలో దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు. జాతీయ అభివృద్ధి లక్ష్యాల సాధనలో అన్ని రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. తెలంగాణలో చేపట్టాల్సిన రహదారుల అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించామని, వాటిపై సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!