దేశంలో పచ్చదనాన్ని పెంపొందించడం, అటవీ ప్రాంతాలను పునరుద్ధరించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ ఇండియా మిషన్ అమలుపై పార్లమెంటరీ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పథకం అమలులో ఆశించిన పురోగతి లేకపోవడం, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టమైన కార్యాచరణ లేకపోవడంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పీఏసీ చైర్మన్ కే.సీ. వేణుగోపాల్ అధ్యక్షతన గురువారం పార్లమెంట్‌లో జరిగిన సమావేశంలో గ్రీన్ ఇండియా మిషన్‌పై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సమర్పించిన పనితీరు ఆడిట్ నివేదికను సమీక్షించారు. ఈ సమావేశానికి పర్యావరణ శాఖ ఉన్నతాధికారులను పిలిపించి వివరణలు తీసుకున్నారు. 2015-16 నుంచి 2024-25 వరకు 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పథకం అమలు తీరును కమిటీ పరిశీలించింది. ఈ కమిటీలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ కూడా సభ్యుడిగా ఉన్నారు.

లక్ష్యంలో కేవలం 5 శాతం మాత్రమే సాధన

2014లో ప్రారంభించిన గ్రీన్ ఇండియా మిషన్ ద్వారా 2018 నాటికి 28 లక్షల హెక్టార్ల భూమిలో అటవీకరణ చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే 2025 మార్చి నాటికి కేవలం 1.47 లక్షల హెక్టార్లలో మాత్రమే అటవీకరణ చర్యలు చేపట్టినట్లు సీఏజీ నివేదిక వెల్లడించింది. అంటే నిర్దేశిత లక్ష్యంలో సుమారు 5.3 శాతం మాత్రమే సాధించినట్లు స్పష్టమవుతోంది.

ఈ పథకానికి మొత్తం రూ.13 వేల కోట్ల వ్యయాన్ని అంచనా వేయగా, అందులో రూ.10,600 కోట్లను క్యాంపా, ఉపాధి హామీ పథకం, జాతీయ అటవీకరణ కార్యక్రమం వంటి ఇతర పథకాల సమన్వయం ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంది. అయితే ఈ నిధుల సమన్వయం జరగకపోవడంతో పథకం అమలుకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయని సీఏజీ గుర్తించింది. పదేళ్ల కాలంలో బడ్జెట్ మద్దతు ద్వారా కేవలం రూ.1,149.14 కోట్లు మాత్రమే అందినట్లు నివేదిక పేర్కొంది.