కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన 575 టీఎంసీల వాటాను సాధించుకునే విషయంలో తమ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఈ విషయంలో ఎవరూ అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కుల కోసం రాజకీయంగా, న్యాయపరంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు సుప్రీంకోర్టులోనూ పోరాటం చేస్తున్నామని వెల్లడించారు.
కృష్ణా, గోదావరి నదీ జలాలపై వస్తున్న వార్తలు, పల్నాడు వాటర్ గ్రిడ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించుకుపోతుందన్న ఆరోపణలు, అంతర్రాష్ట్ర జల వివాదాలపై వాస్తవాలను వివరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
తెలంగాణకు 575 టీఎంసీలు రావాల్సిందే
బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించిందని సీఎం గుర్తుచేశారు. రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో 71 శాతం తెలంగాణలోనే ఉన్నందున రాష్ట్రానికి 575 టీఎంసీల నీటి వాటా దక్కాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచే ఈ న్యాయమైన వాటా కోసం పోరాడాల్సి ఉందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి వద్ద తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తున్నామని తెలిపారు. అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని, ప్రధానమంత్రిని కూడా కలిసి రాష్ట్ర హక్కులను వివరించామని వెల్లడించారు.
గత ప్రభుత్వంపై సీఎం విమర్శలు
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా మొదట 11 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకునే అవకాశం ఉండగా, గత ప్రభుత్వ హయాంలో దాని సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచుకునేందుకు అవకాశం కల్పించారని సీఎం ఆరోపించారు. 2005 మార్చి 29న ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులోనే పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి నీటిని తరలించనున్నట్లు స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న హరీశ్ రావు అభ్యంతరం వ్యక్తం చేయలేదని విమర్శించారు.
అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2020లో అనుమతులు ఇచ్చారని, హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్-1 ద్వారా 40 టీఎంసీల నీటిని తరలించేందుకు 2004లో జీవో నంబర్ 73 జారీ చేసిన సమయంలోనూ తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం జరగలేదని అన్నారు.
తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దు
కృష్ణా జలాల విషయంలో వాస్తవాలను పక్కనపెట్టి తప్పుడు ప్రచారంతో ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం అన్నారు. తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతోందంటూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, ప్రజల్లో అనుమానాలు కలిగించడం సరికాదని పేర్కొన్నారు. ఎవరైనా ఈ అంశంపై వక్రీకరించి మాట్లాడితే సంబంధిత జీవోలు, అధికారిక పత్రాలు, వాస్తవాలను పరిశీలించాలని ప్రజలకు సూచించారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!