కృష్ణా నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం (నవంబర్ 23) హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అబద్ధపు ప్రచారాలతో ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ నిర్ణయాల వల్లే అన్యాయం:


మాజీ సీఎం కేసీఆర్ తన పదవీకాలంలో కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీల వాటాకు అంగీకరిస్తూ సంతకాలు చేయడం ద్వారా తెలంగాణ నీటి హక్కులపై 'మరణ శాసనం' (డెత్ వారెంట్) రాశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలాగే తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును మార్చడం, తక్కువ నీటి వాటాకు ఒప్పుకోవడం తెలంగాణకు చావుదెబ్బ వంటివని వ్యాఖ్యానించారు. ఈ తప్పిదాలకు 2023 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన శిక్ష సరిపోదని, కేసీఆర్‌ను రాజకీయంగా శాశ్వతంగా సమాధి చేసినప్పుడే పూర్తి శిక్ష పడినట్లవుతుందని సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పల్నాడు వాటర్ గ్రిడ్‌పై స్పష్టత:


ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందన్న బీఆర్ఎస్ ఆరోపణలను సీఎం తోసిపుచ్చారు. 2022లో కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలోనే ఈ పథకానికి సంబంధించిన జీవో విడుదలైందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ 'జల్ జీవన్ మిషన్' కింద పల్నాడు, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టుపై నాటి కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వద్ద గానీ, కేంద్రం వద్ద గానీ ఎలాంటి అభ్యంతరాలు ఎందుకు వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే తమ ప్రభుత్వం KRMBకి ఫిర్యాదు చేసిందని, పనులను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని సీఎం స్పష్టం చేశారు.