జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న స్కార్పియో ఎస్‌యూవీ మరో వాహనాన్ని ఢీకొట్టడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌లోని నలంద జిల్లా జంఘారో గ్రామానికి చెందిన 14 మంది స్కార్పియో వాహనంలో జార్ఖండ్‌లోని రజరప్ప ఆలయ దర్శనానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో రాంచీ–పట్నా జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-33)పై రామ్‌గఢ్‌ జిల్లా కూజు ప్రాంతంలోని పైంకి గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన స్కార్పియో ముందున్న మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించేందుకు సహకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన వ్యక్తిని రామ్‌గఢ్‌ సదర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. మృతుల్లో చిన్నారులు అధిక సంఖ్యలో ఉండటంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.