తెలంగాణ హైకోర్టు ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి రెండు వారాల సాధారణ జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా విధించింది. భూ వివాదానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో ఈ నిర్ణయం తీసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ భూ వివాదంలో పిటిషనర్‌కు రక్షణ కల్పించాలని గతంలో హైకోర్టు పోలీసు అధికారులను ఆదేశించింది. అయితే న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు అమలు చేయలేదని ఆరోపిస్తూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారాన్ని విచారించిన హైకోర్టు కోర్టు ధిక్కరణగా పరిగణించి ఇద్దరు అధికారులకు జైలు శిక్ష విధించింది. విధించిన రూ.2 వేల జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో వారం రోజులు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది.

అయితే తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునేందుకు వీలుగా జైలు శిక్ష అమలును వారం రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈలోగా పైకోర్టు నుంచి స్టే ఉత్తర్వులు పొందాలని సూచించింది. లేనిపక్షంలో గడువు ముగిసిన వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోయి శిక్షను అనుభవించాలని ఆదేశించింది.

కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో పోలీసు ఉన్నతాధికారులు సైతం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందేనని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. గతంలోనూ కోర్టు ఉత్తర్వులను పాటించని పలువురు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు హైకోర్టు కోర్టు ధిక్కరణ కింద జైలు శిక్ష విధించిన సందర్భాలున్నాయి. అయితే కొందరు అధికారులు క్షమాపణలు చెప్పడం, పైకోర్టును ఆశ్రయించడం ద్వారా శిక్ష నుంచి ఉపశమనం పొందారు.