తెలంగాణ ఆర్టీసి పండగల సమయాలలో స్పెషల్ బస్సుల పేరుతో ఎందుకు అధిక చార్జీలు వసూల్ చేస్తున్నారు. స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికులకు మీరు కల్పించే అదనపు సౌకర్యాలు ఏమిటి అని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయగా వారు ఇచ్చిన సమాచారాన్ని సంస్థ ఫౌండర్ రాజేంద్ర వెల్లడించారు.

పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీ ఒకవైపు ఎక్కువగా ఉంటుందని ఆర్టీసీ వివరించింది. పండుగకు ముందు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా, పండుగ అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందని పేర్కొంది.


ఈ రద్దీని నియంత్రించేందుకు సాధారణ సర్వీసులతో పాటు అదనపు ప్రత్యేక బస్సులను నడపాల్సి వస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలపై గరిష్టంగా 1.5 రెట్లు వరకు వసూలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం 2003 ఫిబ్రవరి 3న జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 16, రవాణా, రహదారులు మరియు భవనాల శాఖ ఉత్తర్వుల ప్రకారం ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక బస్సు సర్వీసులకు సాధారణ ఛార్జీలపై గరిష్టంగా 1.5 రెట్లు వరకు ఛార్జీలు వసూలు చేసేందుకు ఆర్టీసీకి అనుమతి ఇచ్చినట్లు అధికారులు తమ సమాధానంలో పేర్కొన్నారు. దీంతో పండుగల సమయంలో ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల వసూళ్లకు సంబంధించి ఆర్టీసీ అనుసరిస్తున్న విధానం, దాని వెనుక ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులు మరోసారి చర్చకు వచ్చాయి.