ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బంధువులను సాగనంపేందుకు వందే భారత్‌ రైలు ఎక్కిన 12 మంది ఆటోమేటిక్‌ డోర్లు మూసుకుపోవడంతో రైలులోనే చిక్కుకుపోయారు. రైలు కదలడంతో సుమారు 140 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. నవంబర్‌ 15న కాన్పూర్‌ సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. వారణాసి–న్యూఢిల్లీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో తమ బంధువులను ఎక్కించిన 12 మంది రైలు లోపలే ఉండగా తలుపులు మూసుకుపోయాయి. రైల్వే సిబ్బందిని తలుపులు తెరవాలని కోరినా ఫలితం లేకపోవడంతో రైలు బయలుదేరింది. ఈ విషయాన్ని రైల్వే కంట్రోల్‌ రూమ్‌కు తెలియజేయడంతో ఇటావా జంక్షన్‌ వద్ద రైలును నిలిపివేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు మహిళలు, పిల్లలతో సహా 12 మందిని కిందకు దించి ఆర్పీఎఫ్‌ కార్యాలయానికి తరలించారు. సరైన టికెట్‌ లేకుండా రైలులోకి ప్రవేశించి నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఒక్కొక్కరికి రూ.3,000 చొప్పున మొత్తం రూ.36,000 జరిమానా విధించారు. అనంతరం మరోసారి ఇలాంటి పొరపాటు చేయవద్దని హెచ్చరించి వదిలేశారు.