అమెరికాలోని ఓ న‌గ‌రంలో "డోర్ బెల్ కొట్టి, పార్శిల్‌ను రిఫ్లెక్స్‌కు ఇవ్వండి" అనే బోర్డు కనిపిస్తుంది. బెల్ కొట్టగానే తలుపు తీసేది మనిషి కాదు, రెండు మీటర్ల ఎత్తు, అనేక కీళ్లు కలిగిన చేతులు, చక్రాల పీఠంతో ఉండే ‘రిఫ్లెక్స్’ అనే హ్యూమనాయిడ్ రోబో! కార్డ్‌బోర్డ్ బాక్సులు అమర్చడం, చెత్త వేయడం, ప్యాకేజీలపై లేబుల్స్ స్కాన్ చేయడం, మంచును తొలగించడం వంటి పనులను ఇది అవలీలగా చేస్తోంది. ఒకప్పుడు కేవలం కంప్యూటర్ స్క్రీన్లకు మాత్రమే పరిమితమైన కృత్రిమ మేధస్సు, ఇప్పుడు భౌతిక రూపం దాల్చి హ్యూమనాయిడ్ రోబోల రూపంలో వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. ఫ్యాక్టరీల కంటే ముందుగా ఇవి మన ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం ఉంది. 

గతంలో రోబోలను రిమోట్ కంట్రోల్‌తో నడపడం లేదా ప్రతి కదలికకు కోడింగ్ రాయడం చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఓపెన్ఏఐ రూపొందించిన 'ఆస్ట్రా' వంటి ఆధునిక ఏఐ మోడళ్లను రోబోటిక్ చేతులకు అనుసంధానిస్తే, అవి వీడియో ఫీడ్ చూస్తూ సొంతంగా పనులను నేర్చుకుంటున్నాయి. రాబోయే రెండేళ్లలో రోబోలు తమలాంటి మరో రోబోను సొంతంగా అసెంబుల్ చేయగల స్థాయికి చేరుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

డ్రోన్ పరిశ్రమ వల్ల చిన్న, శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్లు, ఎలక్ట్రిక్ వాహనాల వల్ల మెరుగైన బ్యాటరీలు అందుబాటులోకి రావడంతో రోబోల ధరలు భారీగా పడిపోయాయి. 2000వ దశకం మధ్యలో ఒక హ్యూమనాయిడ్ రోబో ఖరీదు సుమారు 10 లక్షల డాలర్లు ఉండగా, నేడు చైనాకు చెందిన యూనిట్రీ, అజిబాట్ సంస్థలు కేవలం 50,000 డాలర్లకే అందిస్తున్నాయి. 2023 నుండి 2025 మధ్య కాలంలోనే యూనిట్రీ రోబోల సగటు ధర 72 శాతం తగ్గింది. 


ప్రపంచవ్యాప్తంగా ఉన్న హ్యూమనాయిడ్ రోబోలలో 80 శాతానికి పైగా చైనాలోనే ఉన్నాయి. కర్మాగారాల్లో 24 గంటల పాటు కఠినమైన పనులు చేయడానికి రోబోల మన్నికపై ఇంకా పరిశోధనలు జరుగుతుండగా, ఇళ్లలో తక్కువ బరువున్న పనులు (బట్టలు మడతపెట్టడం, ఇల్లు సర్దడం) చేయడానికి వీటిని సురక్షితంగా వాడుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. గూగుల్ డీప్‌మైండ్ అంచనా ప్రకారం 2031 నాటికి అమెరికా ఇళ్లలో 10 లక్షల రోబోలు, మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం 2040 నాటికి 16 లక్షల రోబోలు (ఒక్కోటి సుమారు 30,000 డాలర్ల ధరకు) పనిచేసే అవకాశం ఉంది.