దేశంలోని ప్రతి పౌరుడి ఓటుకు సమాన విలువ ఉండాలనే రాజ్యాంగ సూత్రం (ఆర్టికల్ 82 మరియు 170) ప్రకారం, ప్రతి పదేళ్లకొకసారి జరిగే జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను మరియు వాటి భౌగోళిక సరిహద్దులను సవరించే ప్రక్రియనే ‘డీలిమిటేషన్’ అంటారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం నియమించే స్వతంత్ర ‘డీలిమిటేషన్ కమిషన్’ ఆదేశాలకు చట్టబద్ధత ఉంటుంది.


భారతదేశంలో తొలి మూడు దశాబ్దాల్లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచుతూ వచ్చారు.

1952 డీలిమిటేషన్: 1951 జనాభా లెక్కల ఆధారంగా 1952లో మొదటి కమిషన్ ఏర్పాటై లోక్‌సభ సీట్లను 494గా నిర్ణయించింది.
1963 డీలిమిటేషన్: 1961 జనాభా లెక్కల ఆధారంగా 1963లో లోక్‌సభ స్థానాల సంఖ్యను 522కు పెంచారు.
1973 డీలిమిటేషన్: 1971 జనాభా లెక్కల ఆధారంగా 1973లో చివరిసారిగా లోక్‌సభ సీట్ల సంఖ్యను 543కు (మొత్తం 545, ఇందులో ఇద్దరు ఆంగ్లో-ఇండియన్ సభ్యులు ఉండేవారు; తర్వాత ఆ కోటా రద్దయింది) పెంచారు.

1976లో సీట్ల పెంపును ఎందుకు ఆపేశారు.?

1970వ దశకంలో కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ కోసం ‘కుటుంబ నియంత్రణ’ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టింది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలు ఈ విధానాలను సమర్థవంతంగా అమలు చేసి జనాభా వృద్ధిని అదుపులోకి తెచ్చాయి. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా వేగంగా పెరుగుతూనే ఉంది. ఒకవేళ జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే, జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం (సీట్లు) తగ్గిపోయి, జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు భారీగా పెరిగే ప్రమాదం ఏర్పడింది. "దేశ ప్రయోజనాల కోసం జనాభాను నియంత్రించినందుకు మమ్మల్ని శిక్షిస్తారా?" అని దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో 1976లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971 జనాభా లెక్కల ప్రకారం ఉన్న 543 లోక్‌సభ సీట్ల సంఖ్యను 2000 సంవత్సరం వరకు మార్చకుండా నిలిపివేసింది.

ప్రస్తుత 2026 పరిస్థితి ఏమిటి?

రాజ్యాంగం నిర్దేశించిన 2026 గడువు ముగియడంతో, తదుపరి జనాభా లెక్కల ఆధారంగా మళ్లీ నియోజకవర్గాల పునర్విభజన మరియు మహిళా రిజర్వేషన్ల అమలుపై జాతీయ స్థాయిలో కీలక కసరత్తు మొదలైంది. అయితే, సీట్ల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకుండా ఎలాంటి సమతుల్య ఫార్ములాను అనుసరిస్తారన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.