హైదరాబాద్: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, పరిశోధనాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు సైన్స్ ఫెయిర్లు గొప్ప వేదికలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇర్రంమంజిల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన 54వ హైదరాబాద్ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు.

392 వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు

ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, ప్రయోగాలను పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు. హైదరాబాద్ జిల్లాలో ఐదు విభిన్న విభాగాల్లో మొత్తం 392 వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా సాంఘిక శాస్త్రం, సైన్స్ విభాగాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన 167 ప్రదర్శనలు వారి ప్రతిభకు, ఆలోచనా శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు.

నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలని, విద్యార్థులు పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా కొత్త విషయాలను అన్వేషిస్తూ సమాజంలోని సమస్యలకు వినూత్న పరిష్కారాలు కనుగొనాలని సూచించారు. సెల్‌ఫోన్లలో ఆటలకే పరిమితం కాకుండా విజ్ఞాన అన్వేషణ, సృజనాత్మకత వైపు పిల్లలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.