ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై జిల్లావ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రజలకు క్రీడల ప్రాధాన్యతపై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

కలెక్టరేట్‌లో సెల్ఫీ పాయింట్ ప్రారంభం:

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖేలో ఇండియా సెల్ఫీ పాయింట్‌ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ప్రధాన కూడళ్లు, క్రీడా మైదానాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఖేలో ఇండియా క్రీడలకు సంబంధించిన ఫ్లెక్సీలు, కటౌట్లు, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రచార కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.

డిసెంబర్ 21 వరకు ప్రచార కార్యక్రమాలు:

క్రీడా పోటీలు ముగిసే డిసెంబర్ 21వ తేదీ వరకు ప్రతిరోజూ వివిధ ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. సంబంధిత క్రీడా పాఠశాలలు, డీబీడీ కాంప్లెక్స్ మైదానం, ఏటీడీపీ పాఠశాల హాళ్లలో అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ విజయవంతం కావడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్.ఎస్. చిత్తు, డీఆర్వో స్రవంతి, క్రీడా శాఖ అధికారులు దయానంద్, పార్థసారథి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.