తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది. సాయుధ ఉద్యమానికి స్వస్తి పలికి పోలీసుల ఎదుట లొంగిపోయిన 214 మంది మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.59 కోట్ల నగదు ప్రోత్సాహకాలను అందించింది. డీజీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఈ ఆర్థిక సాయాన్ని పంపిణీ చేశారు. ఇదే సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావుతో పాటు మరో ఇద్దరు కీలక నేతలు కూడా లొంగిపోయి సాధారణ జీవితంలోకి రావాలని డీజీపీ కోరారు. వారికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

మూడేళ్లలో 824 మంది లొంగుబాటు

2024 జనవరి 1 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 824 మంది మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిశారు. వీరిలో 2024లో 49 మంది, 2025లో 509 మంది, 2026లో ఇప్పటివరకు 266 మంది ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణకు చెందినవారు 59 మంది, ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారు 754 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 9 మంది ఉన్నారు. మహారాష్ట్ర, ఒడిశా నుంచి ఒక్కొక్కరు లొంగిపోయారు. 
లొంగిపోయిన వారిలో అర్హత కలిగిన 755 మందికి ప్రభుత్వం రూ.22.31 కోట్లకు పైగా నగదు బహుమతులు మంజూరు చేసింది. ఇప్పటివరకు 659 మందికి రూ.17.68 కోట్లకు పైగా చెల్లింపులు జరిపింది. ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు సమర్పించాల్సి ఉన్న మరో 96 మందికి ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత నగదు అందించనున్నారు. తాజాగా 214 మందికి రూ.5.59 కోట్ల ప్రోత్సాహక నగదును పంపిణీ చేశారు.

నగదుతో పాటు వైద్యం, ఇళ్ల స్థలాలు

లొంగిపోయిన వారికి ఆర్థిక సహాయంతో పాటు సామాజికంగా స్థిరపడేందుకు ప్రభుత్వం పలు పునరావాస సదుపాయాలను కల్పిస్తోంది. తెలంగాణకు చెందిన 57 మందికి నిమ్స్‌లో ఉచితంగా వైద్య సేవలు పొందేందుకు 'ఆరోగ్య రక్షణ' కార్డులు జారీ చేశారు. మరో ఇద్దరికి ఆధార్ ప్రక్రియ పూర్తికాగానే కార్డులు అందించనున్నారు. ఇక రాష్ట్రానికి చెందిన 59 మంది లొంగిపోయిన వారిలో 10 మందికి ఇప్పటికే ఇళ్ల స్థలాలు కేటాయించారు. మిగిలిన 49 మందికి స్థలాల పంపిణీకి సంబంధించిన చర్యలు కొనసాగుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన 765 మందికి అదనపు పునరావాస సౌకర్యాలు కల్పించే విషయమై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు.

కర్రెగుట్టల్లో 252 తుపాకులు స్వాధీనం

మావోయిస్టుల లొంగుబాట్లతో పాటు వారి ఆయుధ నిల్వలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఈ ఏడాది లొంగిపోయిన వారి నుంచి, తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల ప్రాంతంలో గుర్తించిన తొమ్మిది రహస్య డంపుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 252 తుపాకులు, 359 బీజీఎల్ షెల్స్ లభించినట్లు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో 48 ఏకే-47 రైఫిళ్లు, 37 ఇన్సాస్ రైఫిళ్లు, 37 ఎస్ఎల్ఆర్‌లు, నాలుగు ఎల్ఎంజీలు, 25 .303 రైఫిళ్లు తదితర ఆయుధాలు ఉన్నాయి. మిగిలిన వాటిలో వివిధ రకాల తుపాకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.