ఆదిలాబాద్:

ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఓటరు గుర్తింపు కార్డులో మార్పులు చేసుకోవాలనుకునే వారు సంబంధిత నిబంధనల ప్రకారం ఒకేసారి దరఖాస్తు చేసుకోవాలని, ఒకే సవరణ ప్రక్రియలో పదేపదే దరఖాస్తులు సమర్పించరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అప్పీల్‌పై ఆయన విచారణ నిర్వహించారు.

అప్పీల్ పూర్వాపరాలు:

మావల మండలం కైలాష్‌నగర్‌కు చెందిన గుండ్లవార్ శేఖర్ తన ఓటరు గుర్తింపు కార్డులో ఇంటిపేరును ‘గుండ్ల’ నుంచి ‘గుండ్లవార్’గా మార్చాలని కోరుతూ జులై 4, 2026న ఫారం-8 ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, ఎన్నికల నమోదు అధికారి (ERO) సెప్టెంబర్ 18న ఆమోదించారు. అనంతరం తన తండ్రి పేరును ‘గుండ్ల చంద్రకాంత్’ నుంచి ‘గుండ్లవార్ చంద్రకాంత్’గా సవరించాలని కోరుతూ అక్టోబర్ 5న మరోసారి ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. అయితే విచారణ అనంతరం ఈ దరఖాస్తును ERO నవంబర్ 26న తిరస్కరించారు. దీంతో తిరస్కరణకు గల కారణాలను తెలియజేయాలని కోరుతూ శేఖర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోగా, కలెక్టర్ సంబంధిత వివరాలను పరిశీలించారు.

నిబంధనల మేరకు చర్యలకు ఆదేశం:

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో పేరు, ఇంటిపేరు, ఇతర వివరాల్లో మార్పులు అవసరమైనప్పుడు నిబంధనల ప్రకారం సరైన ఆధారాలతో ఒకేసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 22, 2026న తుది ఓటరు జాబితా ప్రచురించిన అనంతరం సంబంధిత అంశంపై ఎన్నికల నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎన్నికల నమోదు అధికారిని ఆదేశించారు. ఈ విచారణలో ఆర్డీవో జగదీశ్వర్ రావు, మావల తహశీల్దార్ వేణు, ఎన్నికల పర్యవేక్షణ అధికారి నలంద ప్రియ తదితరులు పాల్గొన్నారు.