ఫోన్‌ ఎక్కువగా చూస్తున్నావంటూ తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బొమ్మలగుడి సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎల్లమ్మ రంగాపురానికి చెందిన లక్ష్మిదేవి (25)కి, నల్గొండ జిల్లా టీపీగౌరారానికి చెందిన లక్ష్మణ్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కుటుంబంతో కలిసి హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు.


ఇటీవల భర్త ఆమెకు ఈఎంఐ పద్ధతిలో సెల్‌ఫోన్‌ కొనిచ్చాడు. అయితే ఆమె నిత్యం ఫోన్‌ చూస్తుండటంతో గురువారం తల్లి అలివేలు మందలించింది. ఇంటి పనులు పట్టించుకోకుండా ఫోన్‌ చూస్తే ఎలా అని ప్రశ్నించింది. దీంతో లక్ష్మిదేవి మనస్తాపానికి గురైనట్లు సమాచారం.
శుక్రవారం ఉదయం భర్త పనికి వెళ్లిన తర్వాత లక్ష్మిదేవి తన ఏడేళ్ల కుమార్తెను పాఠశాలకు పంపకుండా ఇంట్లోనే ఉంచింది. ఇద్దరు పిల్లలను టీవీ చూసుకోమని చెప్పి గదిలోకి వెళ్లింది. అనంతరం చోటుచేసుకున్న ఘటనతో ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోయారు.
సమాచారం అందుకున్న హయత్‌నగర్‌ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒక చిన్న మందలింపు.. ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.