హైదరాబాద్: థియేటర్లలో కొత్తగా విడుదలైన సినిమాలను రహస్యంగా రికార్డ్ చేసి, పైరసీ వెబ్‌సైట్లు మరియు టెలిగ్రామ్ ఛానెళ్ల ద్వారా అక్రమంగా పంపిణీ చేస్తున్న వ్యవస్థీకృత పైరసీ నెట్‌వర్క్ గుట్టును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రట్టు చేసింది. ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఇద్దరు 19 ఏళ్ల విద్యార్థులను టీజీసీఎస్బీ యాంటీ పైరసీ యూనిట్ నవంబర్ 20న అరెస్ట్ చేసింది.అరెస్టయిన నిందితులను కర్నూలు సంతోష్ నగర్‌కు చెందిన షేక్ రిజ్వాన్ (19), భగత్ సింగ్ నగర్‌లోని కప్పల నగర్‌కు చెందిన రాంపోగు అజయ్ (19)లుగా గుర్తించారు. థియేటర్లలో సినిమాలను రికార్డ్ చేయడానికి ఉపయోగించిన మూడు మొబైల్ ఫోన్లను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు.