శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి విమానాల్లో వెళ్లే భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుభవార్త అందించారు. అయ్యప్ప భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఇరుముడి తమతో పాటు వెంట తీసుకెళ్లే వెసులుబాటును వరుసగా మూడో ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు ఆయన శనివారం (నవంబర్ 21) ఎక్స్ (X) వేదికగా ప్రకటించారు. సాధారణ విమానయాన భద్రతా నిబంధనల ప్రకారం కొబ్బరికాయలను క్యాబిన్ లగేజీలో అనుమతించరు. దీంతో గతంలో ఇరుముడిని చెక్-ఇన్ లగేజీలో పంపాల్సి రావడంతో భక్తులు తీవ్ర ఆవేదనకు, అసౌకర్యానికి గురయ్యేవారు. దీనిపై రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. శబరిమలై అయ్యప్ప స్వామి భక్తులు పవిత్రమైన ఇరుముడిని తమ వెంట తీసుకెళ్లడం శతాబ్దాలుగా కొనసాగుతున్న భక్తి సంప్రదాయం. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, విమానాల్లో ఇరుముడిని క్యాబిన్‌లో తీసుకెళ్లేందుకు అనుమతులను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.