ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ 'బిస్లెరీ ఇంటర్నేషనల్' కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన ప్యాకేజ్డ్ తాగునీటి నమూనా వినియోగానికి అసురక్షితమని తేలడంతో, బిస్లెరీపై ప్రాసిక్యూషన్ (చట్టపరమైన చర్యలు) ప్రారంభించేందుకు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) ఆదివారం (నవంబర్ 22) అనుమతి మంజూరు చేసింది.బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రాంగణం నుండి "ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్" నమూనాను అధికారులు సేకరించి ప్రయోగశాలకు పంపారు. ఈ పరీక్షల్లో నీటిలో ఉండాల్సిన నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా 'బ్రోమేట్' ఉన్నట్లు తేలడంతో, ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం-2006 కింద దీనిని అసురక్షితమైనదిగా ప్రకటించారు.రెఫరల్ ల్యాబ్ పరీక్షల్లోనూ ‘అసురక్షితం’ అని నిర్ధారణ
అయితే, ప్రాథమిక నివేదికపై బిస్లెరీ సంస్థ అప్పీల్ చేయడంతో, ఆ నమూనాను 'రెఫరల్ ఫుడ్ లాబొరేటరీ'కి పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లోనూ ఆ నీరు అసురక్షితమని తేలింది. ఈసారి నీటిలో క్యాన్సర్ కారకమైన ‘పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్’ ఉన్నట్లు గుర్తించినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. రెండు ల్యాబ్ నివేదికలలోనూ ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా నిర్ధారణ కావడంతో, బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చినట్లు రెగ్యులేటర్ తెలిపింది.
బిస్లెరీతో పాటు వసంత్ మసాలా ప్రైవేట్ లిమిటెడ్, టిట్-బిట్ ఫుడ్స్ ఇండియా, మీమాంస ఇండస్ట్రీస్ మరియు ఆశా కన్ఫెక్షనరీ సంస్థలపైనా ప్రాసిక్యూషన్‌కు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది. నిబంధనలు పాటించని ఊర్మి లైఫ్‌సైన్సెస్ ఎల్ఎల్పీ, గౌర్ ఆయుర్వేదిక్ స్టోర్ లైసెన్సులను సస్పెండ్ చేసింది. అసురక్షితమని తేలిన ప్రీ-ప్యాక్డ్ చాక్లెట్ ఫిల్డ్ కుకీలను మార్కెట్ నుండి వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆశా కన్ఫెక్షనరీని ఆదేశించింది. మరోవైపు, ఈ వ్యవహారంపై బిస్లెరీ ఇంటర్నేషనల్ సోమవారం (నవంబర్ 23) స్పందిస్తూ.. ఇది సుమారు 14 నెలల క్రితం అంటే 2025 సెప్టెంబర్‌లో గోవా ప్లాంట్ నుండి సేకరించిన ఒక బ్యాచ్‌కు సంబంధించిన విషయమని పేర్కొంది. తాగునీటి భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, నిబంధనల ప్రకారం రెగ్యులేటర్‌కు పూర్తిగా సహకరిస్తామని కంపెనీ వివరణ ఇచ్చింది.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!