హైదరాబాద్: నకిలీ ఓఆర్ఎస్ (ORS) పానీయాలపై ఎనిమిదేళ్ల పాటు పోరాడి విజయం సాధించిన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ శివరంజని సంతోష్ మరోసారి తన మానవత్వాన్ని, అంకితభావాన్ని చాటుకున్నారు. అత్యంత అరుదైన జన్యుపరమైన రుగ్మత 'అలన్-హెర్న్‌డన్-డడ్లీ సిండ్రోమ్' తో బాధపడుతున్న చిన్నారులకు ప్రాణధారమైన 'టిరాట్రికాల్' మందు వార్షిక ఖర్చును ఏకంగా రూ. 9 కోట్ల నుండి కేవలం రూ. 2.5 లక్షలకు అందుబాటులోకి తీసుకువచ్చి చరిత్ర సృష్టించారు. ఆమె చేసిన అవిశ్రాంత కృషి ఫలితంగా, దేశంలోని ఏడుగురు చిన్నారులకు నవంబర్ 30న ఒక పూర్తి సంవత్సరానికి సరిపడా టిరాట్రికాల్ మందులను ఉచితంగా అందించనున్నారు.

ఒక తల్లి ఆవేదనతో మొదలైన పోరాటం:


డాక్టర్ శివరంజని వద్ద చికిత్స పొందుతున్న 'ఆరవ్' అనే చిన్నారికి 'MCT8 లోపం' (AHDS) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యాధి వల్ల మెదడు కణాలకు థైరాయిడ్ హార్మోన్లు అందక పిల్లల ఎదుగుదల, కండరాల బలం తీవ్రంగా దెబ్బతింటాయి. దీనికి అవసరమైన టిరాట్రికాల్ మందు భారత్‌లో అందుబాటులో లేకపోవడంతో, ఆరవ్ తల్లి పవిత్ర జర్మనీ నుండి కేవలం ఒక్క నెల మందుల కోసం రూ. 12 లక్షల నుండి రూ. 13 లక్షలు వెచ్చించాల్సి వచ్చింది. ఏడాదికి రూ. 4.68 కోట్ల నుండి రూ. 9 కోట్ల వరకు ఖర్చయ్యే ఈ మందును సామాన్య కుటుంబాలు కొనడం అసాధ్యమని గ్రహించిన డాక్టర్ శివరంజని, దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రధాని, కేంద్ర ఆరోగ్య మంత్రిని ట్యాగ్ చేస్తూ సహాయం కోరారు.