మలేషియా పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయ ప్రయాణికులకు ఆ దేశ ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఇప్పటివరకు భారతీయులకు అందిస్తున్న 30 రోజుల వీసా-రహిత ప్రవేశ సౌకర్యాన్ని 2026 డిసెంబర్ 31తో నిలిపివేస్తున్నట్లు మలేషియా ఇమిగ్రేషన్ విభాగం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 17న జారీ చేసిన నోటీసు ప్రకారం, 2027 జనవరి 1 నుండి మలేషియాలో అడుగుపెట్టే భారతీయ పౌరులందరూ ప్రయాణానికి ముందే చెల్లుబాటు అయ్యే వీసాను తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది.

వీసా దరఖాస్తు వివరాలు మరియు నిబంధనలు:
2027 జనవరి లేదా ఆ తర్వాత మలేషియా వెళ్లే వారు 2026 డిసెంబర్ 1 నుండి మలేషియా అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ 'మై వీసా' ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీసా ప్రాసెసింగ్ ఫీజు నాన్-రిఫండబుల్ అని, అలాగే ప్రయాణ తేదీకి మూడు రోజుల ముందు 'మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్' సమర్పించడం మరియు కనీసం 6 నెలల పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ కలిగి ఉండటం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. దీంతో పాటు పర్యటన పూర్తి కాలానికి సరిపడా ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని కూడా సూచించారు

ఈ నిర్ణయానికి ప్రధాన కారణమేంటి?


పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు 2023 డిసెంబర్‌లో మలేషియా ఈ వీసా మినహాయింపును ప్రవేశపెట్టి, 2026 చివరి వరకు పొడిగించింది. అయితే, టూరిస్ట్ వీసా మినహాయింపును కొందరు దుర్వినియోగం చేస్తున్నారని, నకిలీ ఏజెంట్ల మాయలో పడి ఉద్యోగాల కోసం అక్రమంగా మలేషియాకు వస్తున్నారని ఇటీవల కౌలాలంపూర్‌లోని భారత హైకమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విధంగా గడువు ముగిసినా అక్కడే ఉండిపోతూ ఇబ్బందులు పడుతున్న ఘటనలు పెరగడంతో, విదేశీ సందర్శకుల తనిఖీలను మరింత కట్టుదిట్టం చేసేందుకే ఈ వీసా-ఫ్రీ ఎంట్రీని రద్దు చేసినట్లు మలేషియా హోం మంత్రి సైఫుద్దీన్ నసుతియన్ ఇస్మాయిల్ వెల్లడించారు