కృత్రిమ మేధస్సు (AI) టూల్స్ అభివృద్ధికి, నిర్వహణకు డేటా సెంటర్లు అత్యంత కీలకంగా మారిన వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్ దిగ్గజాలకు ఊహించని షాక్ ఇచ్చారు. విదేశాలలో ఏఐ డేటా సెంటర్లను నిర్మించే అమెరికన్ కంపెనీలపై "భారీ పన్ను" మరియు కఠిన జరిమానాలు విధిస్తామని వైట్‌హౌస్ విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. చైనాలో అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో ఉన్నత స్థాయి త్రైపాక్షిక సదస్సు ముగించుకుని అమెరికాకు తిరిగి వచ్చిన వెంటనే ట్రంప్ ఈ సంచలన ప్రకటన చేశారు. "మా కంపెనీలను ఇతర దేశాల్లో డేటా సెంటర్లు నిర్మించడానికి మేము అనుమతించబోము. ఒకవేళ వారు నిర్మిస్తే నిర్మించుకోవచ్చు, కానీ వాటిపై మేము భారీ స్థాయిలో పన్ను విధిస్తాము" అని ట్రంప్ స్పష్టం చేశారు. విశేషమేమిటంటే, లైవ్‌లో ఈ ప్రకటన చేసే ముందు తన సొంత సిబ్బందికి గానీ, సలహాదారులకు గానీ ఈ ప్రణాళిక గురించి చెప్పలేదని ట్రంప్ స్వయంగా అంగీకరించడంతో అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. 

చైనాకు ప్రయోజనం కలగకూడదనే ఈ నిర్ణయం


అమెరికన్ కంపెనీలు విదేశాల్లో డేటా సెంటర్లు నిర్మిస్తే, ఏఐ రేసులో గెలవడానికి అవసరమైన కంప్యూటింగ్ శక్తిని చైనా సులభంగా చేజిక్కించుకుంటుందని ట్రంప్ ఆరోపించారు. ముఖ్యంగా ఫిన్‌లాండ్‌లో డేటా సెంటర్ (గూగుల్ సంస్థ సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో చేపట్టిన ప్రాజెక్ట్) నిర్మాణ ప్రణాళికలను ప్రస్తావిస్తూ, తాము దానిని అస్సలు అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఏఐ లేదా 'సూపర్ ఇంటెలిజెన్స్'  రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కాపాడుకోవాలంటే మౌలిక సదుపాయాలన్నీ దేశంలోనే ఉండాలని ఆయన అన్నారు.