లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో జనాభాతో పాటు రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి కూడా సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. కేవలం జనాభా ప్రాతిపదికన 50 శాతం సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల జీడీపీ, జనాభా రెండింటినీ పరిగణనలోకి తీసుకుని పునర్విభజన చేపట్టాలని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించిన ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్ 2026’ మీడియా కాంక్లేవ్‌లో సీఎం వివిధ అంశాలపై మాట్లాడారు. దేశాభివృద్ధిలో కాంగ్రెస్ అనుసరించిన విధానాలను ప్రస్తావిస్తూ మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ పేదల అభ్యున్నతినే నిజమైన అభివృద్ధిగా భావించారని పేర్కొన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను మన్మోహన్ సింగ్ కొనసాగించారని గుర్తుచేశారు.

తెలంగాణను దేశ ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ రూపొందించామని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి ప్రాజెక్టులతో రాష్ట్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువస్తామని చెప్పారు. గత మూడేళ్లలో 65 శాతం కార్యక్రమాలు అమలు చేశామని, మిగిలిన వాటిని వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని వెల్లడించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆహ్వానించారు.

విద్యారంగంలో సంస్కరణలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు పాఠశాలల్లోనే అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల హాజరు పెంచడంతో పాటు ఇంటర్మీడియట్ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకువచ్చే చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఆనంద్ మహీంద్రా ఛైర్మన్‌గా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.