ప్రముఖ విద్యావేత్త, ఐఐటీ రామయ్యగా ప్రసిద్ధి చెందిన చుక్కా రామయ్య శతవసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చుక్కా రామయ్య జన్మదినం తెలంగాణ ప్రజలకు, విద్యా వ్యవస్థకు గొప్ప పర్వదినమని సీఎం పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఐఐటీ విద్యను సామాన్య విద్యార్థులకు చేరువ చేసిన గొప్ప విద్యావేత్తగా ప్రశంసించారు.

శాసనమండలి సభ్యుడిగా సామాజిక, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాలు సూచించేవారని గుర్తుచేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కళాశాల లేకపోవడాన్ని మండలిలో ప్రస్తావించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా చేశారని తెలిపారు. చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారితో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. వారి ఆలోచనలు, సూచనల మేరకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. చుక్కా రామయ్య ఆయురారోగ్యాలతో మరింతకాలం జీవిస్తూ అందరికీ స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.