Hyderabad

నల్లగొండ లోపట్టణంలోని 45వ వార్డు ప్రకాశం బజార్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికురాలు జానమ్మపై ఇంటి యజమాని కర్రతో దాడి చేయడాన్ని తెలంగాణ మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన అమానుషమని జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ వక్కల రాణాసాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల ఆరోగ్యం, పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులపై దాడులు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా కార్మికురాలిపై దాడి చేయడం సభ్య సమాజం తలదించుకునే ఘటనగా అభివర్ణించారు.

కార్మికులపై దాడులు, బెదిరింపులు, అవమానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, కార్మికుల ఆత్మగౌరవం, హక్కులు, భద్రత కోసం నిరంతరం పోరాడుతామని వక్కల రాణాసాగర్‌తో పాటు కొత్తకొండ శ్రీనివాస్, దామేర రాజు, అరుణ్, చిరంజీవి స్పష్టం చేశారు.