తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు గుర్తింపు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని గుర్తింపు కమిటీ నిర్ణయించింది. బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కమిటీ చైర్మన్ కే. కేశవరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి, శ్యాం మోహన్ పాల్గొన్నారు. యూనివర్సిటీల ఉద్యమకారులు, కళాకారులు, సబ్బండ వర్గాలతో జరిపిన సంప్రదింపులు, ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. ఉద్యమకారుల వివరాల నమోదు, గుర్తింపు కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో చర్చించారు.