తెలంగాణ రాష్ట్రంలో 2,000 హోంగార్డు పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు పోలీసు శాఖ వార్షిక శిక్షణ క్యాలెండర్ రూపకల్పనతో పాటు నియామక ప్రక్రియకు సంబంధించిన అంశాలపై డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పోలీసు శాఖ భవిష్యత్తు అవసరాలు, సిబ్బంది సంక్షేమం, వచ్చే నెలలో నిర్వహించనున్న పోలీసు రిట్రీట్, మహిళా పోలీసు అధికారుల సదస్సు, తెలంగాణ నూతన పోలీసు మాన్యువల్ రూపకల్పనపై చర్చించారు.

అలాగే రాష్ట్రస్థాయి పోలీసు డ్యూటీ మీట్ నిర్వహణ, ఆలిండియా పోలీసు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాట్లు, తెలంగాణ పోలీసు శాఖకు మంజూరైన సిబ్బంది సంఖ్యపై సమీక్షించారు. ప్రతి అంశానికి సంబంధించి అధికారులకు డీజీపీ బాధ్యతలు అప్పగించి, తదుపరి కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.