పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సోమవారం తెల్లవారుజామున దారుణ హత్య చోటుచేసుకుంది. స్థానిక పవర్‌హౌస్ కాలనీలో నివాసముంటున్న సింగరేణి సంస్థ ఉద్యోగి అట్ల రాజశేఖర్ (30) ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి హతమార్చారు. 


పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో కొందరు యువకులు పక్కా పథకం ప్రకారం రాజశేఖర్‌కు ఫోన్ చేసి ఇంటి బయటకు రప్పించారు. ఆయన బయటకు రాగానే అప్పటికే అక్కడ మాటు వేసిన నలుగురు యువకులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాజశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయినట్లు తెలుస్తోంది. 


సమాచారం అందుకున్న గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, సీసీటీవీ ఫుటేజీ మరియు ఫోన్ కాల్ డేటా ఆధారంగా పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.