విశాఖపట్నం నగరంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ఋషికొండ బీచ్‌లో సముద్ర స్నానానికి దిగి గల్లంతైన 18 ఏళ్ల బీకాం విద్యార్థి సయ్యద్ జాహిద్ రాజా మృతదేహం లభ్యమైంది. విశాఖలోని కోటవీధి ప్రాంతానికి చెందిన జాహిద్ రాజా, డాక్టర్ వి.ఎస్. కృష్ణ / బుల్లయ్య కళాశాలలో బీకాం చదువుతున్నాడు. వారాంతపు విహారయాత్ర కోసం మరో ఏడుగురు కళాశాల స్నేహితులతో కలిసి జాహిద్ రాజా ఋషికొండ బీచ్‌కు వెళ్లాడు. బీచ్ ఒడ్డున ఫోటోలు దిగిన అనంతరం, వీరిలో నలుగురు విద్యార్థులు సముద్రంలో స్నానానికి దిగారు. ఈ క్రమంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో జాహిద్ రాజా ఒక్కసారిగా కెరటాల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు, ఇండియన్ కోస్ట్ గార్డ్ మరియు భారత నౌకాదళం రంగంలోకి దిగి శనివారం రాత్రి నుండి ఆదివారం వరకు టూరిజం బోట్లు, మెరైన్ బోట్లు మరియు నేవీ హెలికాప్టర్ల సాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సుదీర్ఘ గాలింపు అనంతరం జాహిద్ రాజా మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు, భవిష్యత్తుపై ఎన్నో ఆశలున్న చిన్న వయసులోనే సముద్ర కెరటాలకు బలై మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బీచ్‌కు వచ్చే పర్యాటకులు, విద్యార్థులు సముద్రంలో లోతుకు వెళ్లకుండా భద్రతా నిబంధనలు పాటించాలని అధికారులు మరోసారి విజ్ఞప్తి చేశారు
వార్తలు
విశాఖ బీచులో విషాదం: గల్లంతైన బీకాం విద్యార్థి
క్రెడిట్: విక్రమ్ శ్రీరాముల
© ముందడుగు. అనుమతి లేకుండా ఈ కథనాన్ని పునఃప్రచురించరాదు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!