నీతి ఆయోగ్, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా–JICA) సంయుక్తంగా నిర్వహించిన అధ్యయన పర్యటనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ అంకిత్ ఐఏఎస్ పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు. నవంబర్ 15 నుంచి 21 వరకు జపాన్‌లో నిర్వహించిన ఈ పర్యటన ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ధ్రువపత్రాన్ని అందుకున్నారు.
ఆకాంక్షిత మండలాల అభివృద్ధిని లక్ష్యంగా నిర్వహించిన ఈ పర్యటనలో భాగంగా జపాన్‌లో అమలవుతున్న ఉత్తమ విధానాలు, ప్రజా సేవల నిర్వహణ, విద్యా ప్రమాణాల పెంపు, స్థానిక పాలన తదితర అంశాలను కలెక్టర్ అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా తన బృందంతో కలిసి నెరిమా నగరంలోని టొయోటామా ప్రాథమిక పాఠశాలలో పరిశీలించిన విద్యా విధానాలు, బోధనా పద్ధతులు, పాఠశాల నిర్వహణపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు.
అలాగే మిటో నగరంపై నిర్వహించిన కేస్ స్టడీ ద్వారా స్థానిక సంస్థలు ప్రజల అవసరాలను గుర్తించి సేవలు అందిస్తున్న విధానాలను పరిశీలించారు. సోనీ సంస్థపై నిర్వహించిన అధ్యయనంలో సంస్థాగత సంస్కరణలు, పనితీరు మెరుగుదలలో నాయకత్వ పాత్రను తెలుసుకున్నారు. స్థానిక పాలన, ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ సేవల సమర్థవంతమైన అమలుపై జరిగిన సమావేశాలు, క్షేత్రస్థాయి సందర్శనల్లోనూ పాల్గొన్నారు.
కామెంట్లు (0)
కామెంట్ చేయడానికి లాగిన్ అవ్వండి
లాగిన్ఇంకా కామెంట్లు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి!