శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులు రైలు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని దక్షిణ కోస్తా రైల్వే హెచ్చరించింది. రైళ్లు, రైల్వే స్టేషన్లలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రయాణ సమయంలో భక్తులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.


రైళ్లలో కర్పూరం వెలిగించడం, అగరబత్తీలు, కొవ్వొత్తులు వాడటం, హారతి ఇవ్వడం వంటి వాటిని నిషేధించినట్లు రైల్వే స్పష్టం చేసింది. పెట్రోల్, కిరోసిన్, ఎల్పీజీ సిలిండర్లు, గ్యాస్ స్టౌలు, బాణాసంచా, పేలుడు లేదా మండే పదార్థాలను రైళ్లలో తీసుకెళ్లకూడదని తెలిపింది. అగ్నిప్రమాదం లేదా పొగ కనిపిస్తే వెంటనే రైలు మేనేజర్, టీటీఈ, ఆర్పీఎఫ్ లేదా ఇతర రైల్వే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించింది. రైల్లో మంటలు చెలరేగితే అలారం చైన్ ఉపయోగించి రైలును ఆపి, ప్రమాద ప్రాంతానికి దూరంగా ఉండాలని తెలిపింది. ప్రయాణికులు భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని, కదులుతున్న రైలు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ దూకవద్దని హెచ్చరించింది.

రైల్వే భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నేర తీవ్రతను బట్టి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.