దేశంలో ఇప్పుడు మరో భారీ ఆధ్యాత్మిక వేడుకకు రంగం సిద్ధమవుతోంది. 2027లో ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో అర్ధ కుంభమేళా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సాధువులు, అఖాడాలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ముఖ్యంగా అమృత స్నానాల రోజుల్లో గంగానది తీరంలోని హర్ కీ పౌరి సహా ప్రధాన ఘాట్‌లు భక్తులతో కిటకిటలాడనున్నాయి.

హరిద్వార్ అర్ధ కుంభమేళా ఎప్పుడంటే?

హరిద్వార్‌లో 2027 జనవరి 14 నుంచి ఏప్రిల్ 20 వరకు అర్ధ కుంభమేళా నిర్వహించనున్నారు. మకర సంక్రాంతితో ప్రారంభమై చైత్ర పౌర్ణమితో ముగిసే ఈ వేడుకలో మొత్తం 11 పవిత్ర స్నాన పర్వదినాలు ఉండనున్నాయి. వీటిలో నాలుగు అమృత స్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.

2027 అర్ధ కుంభమేళా పవిత్ర స్నాన తేదీలు

జనవరి 14 – మకర సంక్రాంతి
ఫిబ్రవరి 6 – మౌని అమావాస్య
ఫిబ్రవరి 11 – వసంత పంచమి
ఫిబ్రవరి 20 – మాఘ పౌర్ణమి
మార్చి 6 – మహాశివరాత్రి (అమృత స్నానం)
మార్చి 8 – ఫాల్గుణ అమావాస్య (అమృత స్నానం)
మార్చి 15 – దేవ్ డోలీ స్నానం (అమృత స్నానం)
ఏప్రిల్ 7 – నవ సంవత్‌సర స్నానం
ఏప్రిల్ 14 – మేష సంక్రాంతి (ప్రధాన అమృత స్నానం)
ఏప్రిల్ 15 – రామ నవమి
ఏప్రిల్ 20 – చైత్ర పౌర్ణమి (చివరి స్నానం)

ఈ స్నాన పర్వదినాల్లో ముఖ్యంగా అమృత స్నానాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. సాధువులు, అఖాడాల సభ్యులు సంప్రదాయబద్ధంగా శోభాయాత్రలు నిర్వహించి గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.

అర్ధ కుంభమేళా అని ఎందుకు పిలుస్తారు?

హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూర్ణ కుంభమేళా, ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా నిర్వహిస్తారు. హరిద్వార్‌లో చివరి పూర్ణ కుంభమేళా 2021లో జరిగింది. దీంతో ఆరు సంవత్సరాల తర్వాత 2027లో నిర్వహించే వేడుకకు అర్ధ కుంభమేళా అనే పేరు వచ్చింది.

పూర్ణ కుంభమేళా స్థాయిలో ఏర్పాట్లు

2027 అర్ధ కుంభమేళాను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పూర్ణ కుంభమేళా స్థాయిలో భక్తులకు సౌకర్యాలు కల్పించడం, ఘాట్‌ల అభివృద్ధి, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ముందస్తు ఏర్పాట్లు కీలకం కానున్నాయి. మొత్తంగా, 2027 హరిద్వార్ అర్ధ కుంభమేళా మరోసారి దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడిని తీసుకురానుంది. గంగానది తీరంలో జరిగే ఈ మహా వేడుక కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.