వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామంలో శనివారం ఆసరా పెన్షన్దారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగిడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమంతో పాటు వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఆసరా పెన్షన్లు ఎన్నో పేద కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తున్నాయని తెలిపారు. గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న సీఎం రేవంత్ రెడ్డికి, నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి గ్రామ ప్రజలు, పెన్షన్‌దారుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మోడెం ఎల్లగౌడ్, వార్డ్ మెంబర్ వల్లపు యాదమ్మ కుమార్, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు ఎస్‌కే షరీఫ్, సీనియర్ నాయకులు పులి వెంకన్న, మరగని లింగయ్య, మహాలక్ష్మి వెంకన్న, సూరయ్య, నరసింహ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.